శుక్రవారం ‘వంగవీటి’ చిత్రం విడుదల... అధికార పార్టీకి ముచ్చెమటలు?
శుక్రవారం ‘వంగవీటి’ చిత్రం విడుదల... అధికార పార్టీకి ముచ్చెమటలు?
విజయవాడ మాజీ ఎం.ఎల్.ఏ., కాపు ఉద్యమ నాయకుడు వంగవీటి మోహనరంగ జీవితాన్ని ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ చిత్రం ఎలా ఉంటుందోననే అంశంపై తీవ్ర చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. 1980వ దశకంలో విజయవాడలో చోటుచేసుకున్న వర్గ పోరాటాలు, కుల పోరాటాల నేపథ్యంతో ముడిపడిన కథ వంగవీటి.
వంగవీటి-దేవినేని కుటుంబాల మధ్య వర్గపోరుగా ప్రారంభమైన గొడవలు కాస్తా ఆ తదుపరి రెండు సామాజిక వర్గాల పోరుగా మారిన సంగతి విదితిమే. ఈ చిత్రంలో వర్మ వంగవీటి కుటుంబం వైపుకు మొగ్గు చూపుతారా.. లేక దేవినేని కుటుంబంపై మొగ్గు చూపుతారా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇరు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సినిమాను రూపొందించడం జరిగిందని వర్మ ఇప్పటికే ప్రకటించారు. కానీ చిత్ర టైటిల్ వంగవీటి అని పెట్టడం.. వాస్తవమైన పేర్లను సినిమాలోని పాత్రలకు పెట్టడంతో కత్తి మీద సాము లాంటి ఈ పనిని వర్మ ఎలా సెల్యూలాయిడ్ పై చిత్రించి ఉంటారా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.
ఇదిలావుండగా చిత్రంలో రంగాను తక్కువ చేసే సీన్లు ఉన్నాయని, వాటిని చిత్రం నుండి తీసేయాలనీ, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాధా తనయుడు ఇప్పటికే మీడియాలో ప్రకటించారు. మాఫియాలకే భయపడని తాను రాధా లాంటి వాళ్ళ బెదిరింపులకు బెదరనని వర్మ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని కాపులు వంగవీటి రంగాను దైవంగా ఆరాధిస్తుంటారు. పైగా డిసెంబర్ 26 ఆయన వర్ధంతి. కాపులను బీసీల్లోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ మళ్ళీ పోరాటానికి సామాజిక వర్గాన్ని సమాయత్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో కాపుల ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ కాపులను ప్రసన్నం చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో వంగవీటి చిత్రం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ నేతలకు ఈ చిత్ర విడుదల టెన్షన్‌కు గురిచేస్తుంది. ఈ చిత్ర విడుదల వల్ల మళ్ళీ పాత కక్షలు, గొడవలు మొదలైయితే కాపు సామాజికవర్గం ఆ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది.
సినిమా కథ తొలి భాగంలో రాధాను హైలెట్ చేస్తూ, మిగిలిన భాగంలో నెహ్రూ కుటుంబాన్ని హైలెట్ చేస్తున్నారనే పుకార్లు ఇప్పటికే వెలువడ్డాయి. కాపు సామాజిక వర్గం దైవంగా భావించే రంగా ఇమేజ్‌కు డామేజ్ అయితే సహించేది లేదని రంగా అభిమానులు బహిరంగగానే హెచ్చరిస్తున్నారు. అట్లే దేవినేని కుటుంబానికి డామేజ్ జరిగినా ఆ సామాజిక వర్గీయులు తీవ్రంగా స్పందించే అవకాశం లేకపోలేదు. వర్మ కథను సెల్యూలాయిడ్‌పై ఎలా చిత్రించారో చూడాలంటే రేపటి దాకా వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment